ఈనెల 22న ఆదివారం జనతా కర్ఫ్యూ

ఈనెల 22న ఆదివారం జనతా కర్ఫ్యూ (ప్రజలు ఎవరూ బయటకు రాకుండా) చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశ ప్రజలు ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు సంకల్పం, నిబద్ధతతో మెలగాలని పిలుపునిచ్చారు. ‘ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోలేదు. మన సంకల్పం దృఢంగా ఉండాలి. కరోనాను నివారించడానికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. మనం స్వచ్ఛంగా ఉందాం. సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచుదాం. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దు. గుమిగూడొద్దు. ఈ రెండూ కరోనా నివారణకు కీలకం. అలాగే, మీకు సంబంధించిన కొన్ని వారాలు నాకు కావాలి.’ అని ప్రధాని మోదీ అన్నారు. మనకేం కావొద్దని ప్రజలు ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ప్రధాని మోదీ హెచ్చరించారు. రాబోయే రోజులు మరింత ముఖ్యమని, ఎంతవరకు వీలైతే అంత వరకు వ్యాపారం, ఉద్యోగాలు ఇంటి వద్ద నుంచే చేసుకోవాలని పిలుపునిచ్చారు. 60 సంవత్సరాలు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.