ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికి.. ఎమ్మెల్యే సీతక్క స్పెషల్ రిక్వెస్ట్

 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అటవీప్రాంతంలోని కొండ రెడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. వారిని వెంటనే ఆదుకోవాలని కోరారు. సీతక్క ములుగు నుంచి కొండలు, గుట్టలు దాటుకుని వెళ్లి.. దాదాపు నాలుగున్నర గంటలసేపు ప్రయాణించి జిల్లాలోని చింతలపాడు వెళ్లారు. అక్కడ కొండరెడ్డి గూడెంలో, కోయ గూడెంలో నివాసం ఉండే కొండ రెడ్ల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, పప్పు, నూనె, ఉప్పు వంటి నిత్యావసర సరుకులు అందజేశారు. నిత్యావసరాలతో పాటూ ఒక్కో కుటుంబానికి 500 రూపాయలు సహాయం అందించారు. స్థానికులు కూడా తమను ఆదుకునేందుకు వచ్చారని తెలియడంతో.. ఆ ఆనందంలో డోలు మోగించుకుంటూ స్వాగతం పలికారు. సీతక్కతో పాటు అమ్మ ఫౌండేషన్ సంబంధించిన టీచర్లు, TJS నాయకురాలు భవాని రెడ్డి, మిగిలిన సహాయక బృందంతో కలిసి అక్కడికి వెళ్లారు. సీఎం జగన్ వారిని కాపాడాలంటూ సీతక్క ఓ వీడియో ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. చింతలపాడుకు చెందిన వాలంటీర్లు ఏమయ్యారో సమీక్ష చేసి వారికి సాయం చేయాలని సీతక్క కోరారు. ఒక్కపూట తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని.. అతి కష్టం మీద తాము అక్కడికి చేరుకున్నామని.. కుటుంబాలకు నిత్యావసరాలు తీసుకెళ్లామన్నారు. 50 కుటుంబాలకు ఇంటికి రూ.500 ఇచ్చామని.. కొండరెడ్లకు న్యాయం చేయాలని.. వాళ్లకు కనీసం రేషన్ బియ్యం కూడా రావడం లేదన్నారు. గతంలో వారు సంతల్లో నిత్యావసరాలు కొనుగోలు చేసేవారని.. ఇప్పుడు అవి కూడా లేవని...వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అన్నారు.