ఐపీసీ సెక్షన్ 353, 427 కింద  డాక్టర్‌ సుధాకర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్ 353, 427 కింద  డాక్టర్‌ సుధాకర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


(సిటీ ట్రెండ్ న్యూస్ -విశాఖపట్నం)


కరోనా వైరస్‌ సోకిన బాధితులకు చికిత్స చేసే వైద్యులకు ఎన్‌- 95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థీషియా డాక్టర్‌ సుధాకర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం  డాక్టర్ సుధాకర్    గుండు కొట్టించుకుని నడిరోడ్డుపై హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన చేతులు వెనక్కి కట్టేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటన శనివారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, సోషల్ మీడియా వేదికగా డాక్టర్ సుధాకర్‌కు అనుకూలంగా పోస్టులు చేస్తున్నారు.







అయితే తాజాగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 353, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను మెంటల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి బాగోలేదని, మెంటల్ ఆస్పత్రికి తరలించాలని కేజిహెచ్ సూపరింటెండెంట్ అర్జున రిఫర్ చేశారు. కాగా, శనివారమే సుధాకర్‌కు మతిస్థిమితం సరిగా లేదని భావించి పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.







విశాఖపట్నంలో నివాసం ఉండే డాక్టర్ సుధాకర్.. శనివారం సాయంత్రం తన కారులో జాతీయ రహదారిపై వెళుతూ అక్కయ్యపాలెంలోని పోర్టు ఆస్పత్రి వద్ద ఆగారు. అక్కడ ఏమి జరిగిందో గానీ, ఎవరో 100 నంబర్‌కు ఫోన్ చేయగా, నాలుగో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో సుధాకర్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయనను ఓ కానిస్టేబుల్‌ లాఠీతో కొట్టాడు. దాంతో సుధాకర్‌ ‘‘నేను ఆస్పత్రిలో లోపాలు బయటపెట్టాను. అందుకని ఎమ్మెల్యే పెట్ల గణేశ్‌ నన్ను టార్గెట్‌ చేశారు. పోలీసులను పంపించారు. నన్ను చంపేస్తారు.. రక్షించండి’’ అంటూ రోడ్డుపై దొర్లుతూ గుమిగూడిన వారిని ప్రాధేయపడడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులు.. ఆయన మెడపై లాఠీ పెట్టి, రెండు చేతులు వెనక్కివిరి చి, తాళ్లతో బంధించి స్టేషన్‌కు తరలించారు. అనంతరం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



కాగా, ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఉదయం డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లిన తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుధాకర్ తల్లి, భార్యను అనిత ఓదార్చారు.