రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి పకడ్బందీగా చర్యలు
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని
*కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించాలి
*జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి
*విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దు
*నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చూడాలి
విశాఖపట్నం, మార్చి 22: రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని చెప్పారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి కోవిడ్19 కరోనా వైరస్ అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనాను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘‘ అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దని అందరూ ఇళ్లలోనే ఉండాలన్నారు. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు అందుబాటులో ఉంటాయని, నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చూడాలన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు అమ్మితే పోలీసు కేసులు నమోదు చేయాలని సూచించారు. కూరగాయలు, పాలు, మెడిసన్ కోసం మాత్రమే ప్రజలు బయటకు రావాలని కోరారు. దేశంలో భయానక వాతావరణం ఉందని ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
కరోనా కట్టడికి కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు.
కరోనా నివారణకు అధికారులు శ్రమిస్తున్నారని, విదేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేలమందిని స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వంద ఐసొలేటెడ్ పడకలు ఏర్పాటు చేస్తున్నామని, విదేశాల నుంచి వచ్చిన వారితో తిరిగిన వారు వెంటనే 104కు ఫోన్ చేయాలని తెలిపారు. వైద్య చికిత్స తీసుకున్న తర్వాత కొందరు ఇళ్లకు వెళ్లినట్లు వివరించారు. కరోనా నివారణలో ఆయా జిల్లాల్లో గ్రామ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ జిఓ నంబర్ 607 లో గల ఆదేశాలు అమలు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఉన్న ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు 7గురు నుంచి శాంపిల్ సేకరించి వైరాలజీ ల్యాబ్ కు పంపినట్లు వివరించారు. 400 టీంలు 60 వేల మందిని డోర్ టు డోర్ పరిశీలించిన ట్లు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. విశాఖపట్నం లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టు లు ఉన్నాయని రెండింటిని Ministry of shipping ప్రోటోకాల్ ను పాటిస్తున్నట్లు చెప్పారు. జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సమావేశంలో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎల్ శివ శంకర్, ఎం వేణుగోపాల్ రెడ్డి, పాడేరు సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శిక్షణ కలెక్టర్ ప్రతిష్ట, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
--------------------------------------------------------