విజయనగరం: విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ తొలి అనుమానిత కేసు వెలుగుచూసింది. కణపాకకు చెందిన ఓ యువకుడు వైరస్ లక్షణాలతో బాధపడుతూ గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. యువకుడు ఈనెల 15న టాంజానియా నుంచి జిల్లాకు వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని తెలిపారు. యువకుడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపామని.. నివేదిక అందిన తర్వాతే స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. యువకుడికి ప్రస్తుతం జిల్లా కేంద్ర వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు సీతారామ రాజు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని.. వైద్య పరంగా అన్ని జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. వైరస్ కట్టడికి ప్రజలు కూడా తప్పకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ మొదటి అనుమానిత కేసు