కరోనా రోగులకు నేవీ పరికరంతో ప్రాణదానం

సిటీ ట్రెండ్ న్యూస్ reporter: B.santosh kumar



కరోనా రోగులకు నేవీ పరికరంతో ప్రాణదానంఇన్నోవేటివ్ పోర్టబుల్ మల్టీ-ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ ను రూపొందించిన విశాఖ నేవల్ డాక్ యార్డ్


  మహమ్మారి కరోనాకి గురై ఎందరు రోగులు ప్రాణాపాయంలో పడతారో తెలీని సమయంలో  రోగులకు ఆక్సిజన్ సరఫరా అత్యవసరం అవుతోంది. కానీ ఒకేసారి ఎక్కువమందికి ఆక్సిజన్ అవసరాన్ని తీర్చడానికి తగిన సదుపాయాలు ఆస్పత్రులలో లేవు.
ఈ తరుణంలో విశాఖ నావల్ డాక్‌యార్డ్  సిబ్బంది ఒక సిలిండరుకు అమర్చిన ఆరు మార్గాలను  ఉపయోగించి ఒకే యంత్రంతో ఆరుగురికి ఆక్సిజన్ ఇచ్చే వినూత్నమైన 'పోర్టబుల్ మల్టీ-ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ ' ను రూపొందించారు. ఈ ఆవిష్కరణ ఒక ఆక్సిజన్ బాటిల్‌నుంచి ఆరుగురు రోగులకు ఏకకాలంలో ప్రాణవాయువు సరఫరా చేయటానికి వీలు కల్పిస్తుంది, ప్రస్తుతం ఉన్న పరిమిత వనరులతో పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులకు అత్యవసర సంరక్షణ దీనిద్వారా సాధ్యమవుతుంది. ఫైన్ అడ్జస్ట్‌మెంట్ రిడ్యూసర్, ఇంకా ఆక్సిజన్ సిలిండర్ మరియు పోర్టబుల్ ఎంఓఎం ను అనుసంధానించడానికి అవసరమైన  నిర్దిష్ట పరికరాల రూపకల్పన, తయారీ ద్వారా ఈ యంత్రం సాధ్యమైంది.


ఆసుపత్రులలో  సాధారణంగా  ఒక ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒకరికే వెంటిమాస్క్ అమరిక ద్వారా అందుతుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో  5 నుంచి 8 శాతం  రోగులకు వెంటిలేటర్ మద్దతు అవసరం. అయితే పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు దొరకక పోవచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో రోగులు వస్తే అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు సరిపోవు. అందువల్ల అత్యవసర సమయాల్లో సింగిల్ సిలిండర్‌ను ఉపయోగించి చాలా మంది పేద రోగులకు ఒకేసారి ఆక్సిజన్‌ను అందించగల తగిన పోర్టబుల్ పరికరం కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. ఆ అవసరాన్ని నావల్ డాక్ యార్డు తీర్చింది.


ఈ మొత్తం యంత్రం ప్రాథమిక పరీక్షలు విశాఖపట్నంలో నావల్ డాక్‌యార్డ్‌లో జరిగాయి. తరువాత నావల్ హాస్పిటల్  కల్యాణిలో అత్వర పరీక్షలు జరిగాయి, ఇందులో 30 నిమిషాల వ్యవధిలో ఈ పోర్టబుల్ యంత్రాన్ని ఆరుగురికి విజయవంతంగా అమర్చ గలిగారు.  అనంతరం నావల్ డాక్ యార్డ్ నిపుణులు, అధికారులూ రెండు  రేడియల్ హెడర్లతో పోర్టబుల్ యంత్ర తయారీని ప్రారంభించారు. 


మొత్తం 25 యూనిట్లు జిల్లా యం త్రాంగానికి ఇస్తారు.  వీటిలో 5 యూనిట్లను గురువారం అందజేశారు. డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ రియర్ అడ్మిరల్ సుదీప్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ వి వినయ్ చంద్ కు అందజేశారు.  
మెడ్ టెక్ జోన్ పరిశ్రమల ద్వారా ఈ యంత్రాలను సులభంగా పెద్ద ఎత్తున తయారు చేయవచ్చు, దీనికి భారత నావికాదళం డ్రాయింగులను ఉచితంగా రూపొందించి అందించింది.